దివ్యాత్మ స్వరూపులార! మనిషికి ఉన్న విశేషమైనటువంటిది
జ్ఞానమొక్కటే అనేది అందరికీ రూఢీగా తెలిసిన విషయమే. మిగిలినటువంటి ఎనుబదినాలుగు
లక్షల జీవరాసులతో పోలిస్తే, ఒక్క వివేకములో మాత్రమే మనిషి అధికుడైయున్నాడు. అయితే
ఆ వివేకం విజ్ఞానంగా మారాలి అంటే, తన జీవనాన్ని ఎలా గడపాలి? అనే ప్రాధమికమైనటు
వంటి జీవన సత్యాలను గ్రహించవలసిన అవసరం ఉంది. ఎవరి దగ్గర నుంచి గ్రహించాలి?
భూమండలము మీదనున్న సమస్త మానవులని అధ్యయనం చేయాలి అంటే, అది ఒక జీవితంలో సాధ్యమయ్యే
అవకాశం లేదు. అంత దీర్ఘజీవనం కూడా అవకాశం లేదు. కాని గురువు ఉపదేశం ద్వారా ఒక
సాంప్రదాయక విద్యా విధానం ద్వారా విజ్ఞానం మూర్తీభవించినటువంటి సత్ స్వరూపులైనటు
వంటి వాళ్ళని ఆశ్రయించటం ద్వారా, గురుకృపా విశేషం చేత, సచ్ఛాస్త్ర శ్రవణం చేత,
సద్గురుకృప చేత ఈ విజ్ఞానాన్ని సాధించవచ్చు. అయితే ఆశ్రయించేటటువంటి శిష్యులు
గురువుగారికి ఏమి చెయ్యగలుగుతారు? అసలు ఏమి చేస్తే గురు కృప లభిస్తుంది? ఎందుకనంటే
ఎంత శాస్త్రం చదివినా సరే, ఒక వంద పుస్తకాలను మనం compile చేసి ఒక పుస్తకంగా వేసినా
సరే, అవన్నీ చివర ఒక వాక్యంతో ముగిసిపోతాయి. ‘యథార్థం అనుభవైక వేద్యం’ ‘యథార్థం
గురుకృప చేత తెలియవలయును’ ఇలాగ వేదాంతంలో అన్ని స్థితులు అన్ని సాధనలు ఇన్ని
మాట్లాడుకున్న అక్కడకు వచ్చి ఆగిపోతుంది. అంటే మనం ఏమి చేస్తే, ఎలా జీవిస్తే ఈ
గురుకృపను సాధించగలుగుతాము? గురుకృప లేకుండా విజ్ఞానాన్ని సాధించటం అసాధ్యం. అది
స్వీయ ప్రయత్నం ద్వారా సాధింపబడేటటువంటి అంశం కాదు. అందుకే పరంపరానుగతమైనటు వంటి
ఉపాసనా విధే బోధించ బడుతుంది. అధ్యయనం చేయబడుతుంది, నిన్న కూడా మనం నాలుగు
స్థితులు గురించి మాట్లాడుకున్నాం. గురువుగారు వారి గురువుగారు సద్గురువుగారు వారి
గురువుగారు పరమగురువుగారు వారి గురువుగారు పరమేష్ఠిగురువుగారు. అంటే ఎవరి
సంప్రదాయాను సారం వాళ్ళు ఈ నాలుగు తరాల గురువులని స్మరిస్తూ ఉంటారు. ఆరాధిస్తూ
ఉంటారు. ఆశ్రయిస్తూ ఉంటారు. శిష్యుడు గురువుని ఎలా ఆశ్రయించాలి అసలు? ఎందుకంటే ఆ
ఆశ్రయించటంలోనే అసలు రహస్యం అంతా ఇమిడి ఉంది. తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు,
తల్లిని ఎలా ఆశ్రయించి ఉన్నాడు? అంటే మనకి మొదటి ఆశ్రయం ఎక్కడ మొదలైంది? అంతే
కదండీ, తల్లి గర్భంలో తల్లిని ఆశ్రయించి ఉన్నాము. ఆ ఆశ్రయం మనం జన్మించిన తరువాత
తల్లిని ఆశ్రయించే విధానం ఈ రెండిటిలో ఏమైనా మార్పు ఉన్నదా? ఒకటేనా? తల్లి గర్భంలో
ఉన్నప్పుడు మనం ఆశ్రయించిన జీవన విధానానికి, బయటకు వచ్చిన తరువాత తల్లిని
ఆశ్రయించటానికి మధ్యన ఏమైనా భేదం ఉన్నదా? భేదం ఉంది, ఉందా! ఏమిటి? తల్లిగర్భంలో
ఉన్నప్పుడు ఎలా ఆశ్రయించాం? బయటకొచ్చినాక సహజంగా ఆశ్రయించటం లేదా? ఏక కాలంలో
తల్లితో కలిసి ఉన్నాడు, కలవకుండా కూడా ఉన్నాడు. బయటకు వచ్చేసినాక మానసికంగా కలిసే
ప్రయత్నం చేస్తున్నాడు, భౌతికంగా కలవకుండా ఉంటున్నాడు. మరి జన్మనిచ్చినటువంటి
తల్లిని ఆశ్రయించటానికే ఇన్ని రకాల సమస్యలుంటే, మరి సద్గురువుని మనం ఎలా
ఆశ్రయించాలి? ఆ ఆశ్రయంలోనే జ్ఞానం ఇమిడి ఉంది. ఆ ఆశ్రయ ఫలితమే గురుకృప అంటే. అందుకని
పారంపర్యానుగతంగా చెప్పేటప్పుడు ప్రతి చోట చతుర్విధ శుశ్రూషలకి ప్రాధాన్యత
ఇవ్వబడింది. అంగ, స్థాన, భావ & ఆత్మశుశ్రూషలు. ఈ నాలుగు శుశ్రూషా విధానాల
ద్వారానే గురువుని ఆశ్రయించటానికి వీలుంది. ఈ నాలుగు సమగ్రమంగా మనకు తెలియక పోయినట్లయితే
గురువును ఆశ్రయించాము అనుకోవటం కేవలం ఒక భౌతికమైన ప్రక్రియగా మిగిలిపోతుంది. మరి
గురుకృప అంటే భౌతికంగా నిరూపించటానికి వీలుకానిది. తల్లికి బిడ్డ యడల ప్రేమ
ఉంటుందా? కరుణ ఉంటుందా? దయ ఉంటుందా? సాన్నిహిత్యం ఉంటుందా? వీటిలో ఏమి ఉంటాయి? ఈ
నాలిగింట్లో ఏముంటాయి? నాలుగూ ఉంటాయా? నిజానికి దయ, కరుణ, సాన్నిహిత్యం అనేవి
ప్రేమలో అంతర్భాగం. కాని సందర్భానుసారంగా ఒక అంశాన్ని మాత్రమె వ్యక్తీకరించి
నప్పుడు, ఆ పరిమితమైనటువంటి స్థితిలో అవి దయ కరుణ సాన్నిహిత్యంగా పిలువబడుతాయి.
కాబట్టి తల్లి బిడ్డల యడల ప్రేమనే కలిగియుంది అన్నదానితో ముగిసిపోతుంది. కాని ఆ
ప్రేమయొక్క అభివ్యక్తీకరణలోకి వచ్చేప్పటికి ఏమైంది? దయ కరుణ సాన్నిహిత్యం ఇతరత్రా
ఆ సమానార్థక మైనటు వంటి పదాలను మనం వినియోగించవలసి వచ్చింది. మరి గురువుని
ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు వీటిలో దేనితో మనం ఆశ్రయించాలి? లేదా గురువు గారు మన
యెడల ఎలా ప్రతిస్పందించాలి? ఆయన కూడా ప్రేమతోనే స్పందించాలా? దయతో స్పందించాలా?
కరుణతో స్పందించాలా? సాన్నిహిత్యంతో స్పందించాలా? ‘కృప’ అంటే ఏమిటి? అనుగ్రహం
అంటే, అదే నేను అడుగుతున్నది, మనకు అర్థం అయ్యే భాషలో ఏమిటి? గురు అనుగ్రహం అని
గురు కృప అని మనకు శాస్త్రంలో ఉంటుంది. అది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మనం ఎలా
తెలుసుకుంటాం అనేదాన్ని బట్టేగా మనకు నిర్ణయం కలిగేది? అంతేనా అండి? ఆకాశంలో
సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అంథుడికి తెలుస్తుందా? చూపుద్వారా తెలియదు. స్పర్శ
ద్వారా తెలుసుకుంటాడు. అర్థమైందా అండి? కాని మనం సాక్షాత్ సూర్యదర్శనం తెలుసుకో గలుగుతాము.
ఎందుకని చూడగలిగే శక్తి ఉంది కాబట్టి. మరి గురువుని గుర్తించాలి కదా అసలు మొట్టమొదట.
ఆశ్రయించాలి అంటే ఏమి చెయ్యాలి? గుర్తించాలి. అంతేనా కదా? తల్లిని మనం ఎలా
ఆశ్రయించాం? తల్లిని ఆశ్రయిస్తేనే కాదా ఆమె స్థానం ఇచ్చింది గర్భంలో. అంతేనా కాదా?
నువ్వు ఆశ్రయించావా? ఆమె నిన్ను ఆహ్వానించిందా? తల్లి జీవులను ఆహ్వానించటం లేదా?
అంటే తల్లి గర్భాన్ని ఎంపిక చేసుకోవటం అనేది, నీ చేతుల్లో ఉందా? లేకపోతే ఆ
తల్లిదండ్రుల చేతిలో ఉందా? ఎందుకని అంటే, జనన మరణాలు పరస్పరం ఒకదానికొకటి ఆధారపడి
ఉన్నాయి. ఆ ఆశ్రయ లక్షణంలోనే అది ఇమిడి ఉంది. తల్లిదండ్రులకి ఏ సంస్కారబలం ఉందో, ఆ
సంస్కార బలానికి వారిద్వారా జన్మించేటటువంటి శిష్యులకి అనుకూలతలు గాని ప్రతికూలతలు
గాని ఉన్నాయా? అంతేగా ఉండేది? కాని తల్లిదండ్రులు ఎప్పుడు ఎటువంటి శిశువుకి
జన్మనివ్వాలని అనుకుంటారు? అనుకూలమైన శిశువులకే జన్మనివ్వాలని అనుకుంటారు. అంతేనా
కాదా? తమ తెలివితేటలని అనుసరించి తాము అనుకున్నవాటిని అనుసరించి పిల్లల్ని అలా
పెంచి, వాళ్ళని పెద్దవాళ్ళని చేసి తమ ప్రతిబింబాలుగా పెంచేసి వాళ్ళళ్ళో తమని
చూసుకోవటం కోసమని ఆ ఆశయాన్ని నేరవేర్చుకోవటం కోసమని పిల్లల్ని కంటున్నారు. ఇవి
తల్లిదండ్రుల్లో ఉండే భావాలు. మరి వచ్చేటటువంటి పిల్లలు ఎలా వస్తున్నారు? ఇవన్నీ సరిపోతున్నాయా?
సరిపోవటం లేదా? సరిపోవటం లేదుగా! ఒకసారి అలోచించి చూడండి, కళ్ళుమూసుకుని
ఆలోచించుకోండి. మీ పిల్లలు మీ ఆశయాన్ని నెరవేర్చేటట్లుగా మీ ప్రతిబింబాలుగా మీ
జ్ఞాన వారసత్వానికి అధికారులుగా అలా ఉండే అవకాశం ఆ పిల్లల్లో ఉందా? ఆ! అన్నీ ఎలా
ఉన్నాయండి ఇప్పుడు? అంటే ఆశ్రయంలోనే ఎక్కడో 50 50 గా ఉంది. సాంతం వ్యతిరేకము కాదు,
సాంతం అనుకూలముకూడా కాదు. ఈ సాంతం ఒక ప్రక్కగా లేకుండా అసలు సృష్టి ఇలా ఎందుకు
నిర్మాణం చేయబడింది? మనకి ఒక్కళ్ళకే కాదుగా almost all మీకు తెలిసినటువంటి ఏ
మనుషులనైనా చూడండి. అందరూ ఆయా అనుకూల సంస్కారం గాని, వ్యతిరేక సంస్కారం గాని, ఒకే
విషయంలో ఇప్పుడు అనుకూలంగా ఉంటాడు, కాసేపాగితే వ్యతిరేకం అవుతున్నాడు. ఎలా? అంటే
మరి మనం ఇన్ని లక్షణాలతో, ఇన్ని వ్యతిరిక్తతలతో ఇంత అనేకత్వంతో ఉన్నటువంటి వాళ్ళం,
గురువును ఎలా గుర్తించగలుగుతాం? గురువుని ఎలా ఆశ్రయిస్తాం? మన జననం లోనే ఇంత complexity ఉంది. అవునా కాదా? మరి జనన
మరణ రహస్యాన్ని భేదించటానికే గురువు అవసరం. జనన మరణాలనే స్థితిని దాటటానికే గురువు
అవసరం. పునరావృత్తి రహితమైన స్థితిని పొందటానికే గురువు అవసరం. మరి ఆ దృష్టి
కోణంలో అధ్యయనం చేశామా? మనం గురువు గారిని? అంటే గురువుని ఎవరు అధ్యయనం చెయ్యాలి
అసలు? శిష్యులే అధ్యయనం చెయ్యాలి. ఆశ్రయించినటు వంటి శిష్యుడికి గురువులో ఏ
లక్షణాలు కనపడాలి ఇప్పుడు? ఈయనను ఆశ్రయించటం ద్వారా, నాకు మూడు ప్రయోజనాలు కలగాలి.
జనన మరణ రహస్యం భేదించబడాలి. జననం మీద మరణం ఆధార పడుండా? మరణం మీద జననం
ఆధారపడుందా? అసలు నాకీ ఆశ్రయం ఎలా కలుగుతోంది? రెండవ ప్రయోజనం ఏమిటి? అసలు
పునరావృత్తి రహితమైన స్థితి అంటూ ఒకటి ఉందా? ఆ ఉన్నదానికి ఏ లక్షణాలున్నాయో ఆ
లక్షణాలను ప్రతిబింబించేటటువంటి వాడుగా ఆయన ఉన్నారా? శాస్త్రమేమో శబ్ద ప్రమాణంగా
చెప్తోంది. గురువు ప్రత్యక్ష ప్రమాణంగా ఉండాలి. కాబట్టి శాస్త్రం చదివి
విశ్వసించటం. అక్కడ నీకు దర్శించేటటువంటి సమర్ధత ఏర్పడదు. అదే ఆయా లక్షణాలు
మూర్తీభవించి నటువంటి సత్పురుషుడైన గురువు నీకు ఎప్పుడైతే లభిస్తాడో ప్రత్యక్ష
ప్రమాణంగా గురువుని ఆశ్రయించటానికి వీలైంది. ఆ ఆశ్రయించటం ఎట్లా ఆశ్రయించాలయ్యా
అంటే, అంగ స్థాన భావ ఆత్మ శుశ్రూషలతో ఆశ్రయించాలి. అంటే ఏమిటండీ?
అంగ శుశ్రూష ఎలా చెయ్యాలి?
అంటే ప్రతిదాంట్లో ఇందాక చెప్పినట్లుగా వాచ్యార్థము లక్ష్యార్థము ఎప్పుడూ
ఉంటాయి. మామూలుగా వాచ్యార్థముగా మాట్లాడుకుంటే, గురువు గారికి వారి వారి దైనందిన
జీవన కార్యక్రమాలలో వైదిక కార్యక్రమాలలో జ్ఞాన సంబంధమైన కార్యక్రమాలలో బోధా
సంబంధమైన కార్యక్రమాలలో జ్ఞానాభిలాషను పూర్తి చేయవలసినటువంటి పనులలో
భౌతికమైనటువంటి అవసరాలను సమకూర్చటం. అంటే పూర్వకాలంలో అందరూ కూడా మహర్షులు యజ్ఞాలు
యాగాలు చేస్తుండేవారు. ఆయా సమిధలు వగైరాలు. ఇప్పుడు మనమేమి చేద్దాం? ప్రశ్న అలా
ఉండిపోయింది, answer రాలేదు, అంటే అంగ శుశ్రూష ఇప్పుడు సాధ్యమౌతుందా? అంటే శాస్త్రంలో మీరు చదివితే
ఇదే ఉంటుంది అంగ శుశ్రూష అంటే. అంటే మరి మీరు ఆశ్రయించిన గురువులు ఎవరైనా సరే అలా
యజ్ఞ యాగాదులు చేస్తున్నటువంటి మీరు సమిధలు చేకూర్చ వలసినటు వంటి పరిస్థితులు
అలాంటి అంగ శుశ్రూషకు సరిపడా వీలుందా? మరి ఎలా చేద్దాం? ఒకటి మిగిలిపోయింది ప్రశ్న
answer
చేద్దాం తొందరపడి ఏమీ అవసరం
లేదు. మిమ్మల్ని ఆలోచింప చేయటమే నా ఉద్దేశ్యం, ఆలోచించ కుండా బుద్ధి పదునెక్కకుండా
ఏదీ సాధించ లేరండి. ఊరక చదువుకుంటూ పోయాం. ప్రయోజనం లేదు. ప్రవాహ సదృశంగా అందరూ
వెళ్తున్నారు. మనం కూడా గురువు గారి దగ్గరకు వెళ్ళాం. కాళ్ళ మీద పడాలి. పడ్డాం.
విభూతి పెట్టించుకోవాలి పెట్టించుకున్నాం. ఆయన కళ్ళల్లోకి చూడ మన్నారు చూశాం.
ముసుగు కప్పారు కప్పించు కున్నాం. చెవిలో మంత్రం చెప్పారు చెప్పించుకున్నాం. ఇదంతా
భౌతికం. కేవలం ఈ భౌతిక ఆశ్రయమే అంటే, మీరు కూడా మీ తల్లిని ఆశ్రయించింది భౌతిక
ఆశ్రయమే అయి ఉండాలి. అప్పుడు మీకు ‘మాతృదేవోభవ’ అయ్యే అవకాశం లేదు. అట్లాగే ఇక్కడ
కూడా ‘ఆచార్యదేవోభవ’ అయ్యే అవకాశం లేదు. అంటే దివ్యత్వ లక్షణాలని గనుక మనం
గుర్తించ లేకపోయినట్లయితే అక్కడ తల్లి గాని ఇక్కడ ఆచార్యుడు గాని నీకేమి ప్రయోజనం
లేదు. ఆ దివ్యత్వ లక్షణాలను నీలో కలిగింప చేసేవి ఏవైతే ఉన్నాయో, అవి చూపెట్టేవి
ఏవైతే ఉన్నాయో వాటినే ఈ చతుర్విధ శుశ్రూషలు అని చెప్పారు. ఈ నాలుగు శుశ్రూషలను
ఎవరైతే సమర్థంగా సరియైన రీతిలో లక్ష్యశుద్ధితో ఆచరిస్తారో, వాళ్లకి దివ్యత్వం
సిద్ధిస్తుంది. ఈ నాలుగు శుశ్రూషలకు ప్రయోజనం ఏమిటయ్యా అంటే, ఆశ్రయించినటువంటి
వాడు ఈ శుశ్రూషలు చేసినటువంటి వాడికి దివ్యత్వం సిద్ధిస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం
అయినటువంటి గురువుని అంగ శుశ్రూష స్థాన
శుశ్రూష భావ శుశ్రూష ఆత్మ శుశ్రూషలనే నాలుగు శుశ్రూషలని త్రికరణ శుద్ధితో (ఇందాక
చెప్పిన వాళ్ళు ఆ త్రికరణ శుద్ధి విషయం చెప్పారు.) త్రికరణ శుద్ధిగా ఆశ్రయించాలి.
మనం ఇప్పుడు ఆశ్రయించేప్పుడు త్రికరణ శుద్ధిగా ఆశ్రయిస్తున్నామా? అంటే అర్థం
ఏమిటి? మనసా వాచా కర్మణా ఏమిటీ మూడు? ఈ మూడు వల్ల మీ గురువుగారికి ఏమన్నా ప్రయోజనం
ఉన్నదా? మీ మనసు వల్ల ఆయనకేమన్నా ప్రయోజనం ఉందా? మీ వాక్కు వల్ల ఆయనకేమైనా
ప్రయోజనం ఉందా? మీ కర్మానుభవం వల్ల ఆయనేకేమన్నా ప్రయోజనం ఉందా? మరి ఈ మూడింటితోనే
ఆశ్రయించమంటున్నారు కదా! వేరే మార్గం లేదుగా, నీ దగ్గర ఏమున్నాయి. ఈ మూడే ఉన్నాయి.
ఈ మూడిటితోనే ఆ నాలుగు శుశ్రూషలు చెయ్యాలి. వేరే మార్గం లేదు. మనస్సు వాక్కు కర్మ
ఈ మూడింటి ద్వారానే ఆ నాలుగు శుశ్రూషలను చేసి తీరాలి. ఇక్కడ ఎక్కడా కూడా శరీరం
అన్న శబ్దం ఉందా? లేదు మనసు వాక్కు కర్మ అంటే అర్థం ఏమిటయ్యా? స్థాన శుశ్రూషలో
చూస్తే శాస్త్రంలో ఏమని చెప్తోంది? ఎదో గురువుగారు కూర్చునే కుర్చీ బాగు చెయ్యి,
ఆయన పడుకునే పడక బాగు చెయ్యి లేకపోతే ఆయన గృహాన్ని బాగు చేసుకోవడంలో ఆయన యొక్క
పూజాగదిని శుభ్ర పరచటంలో వాచ్యార్థంగా చెప్పినప్పుడు ఈ రకమైనటు వంటి అర్థాన్ని
చెప్పుకోవాలి. మరి అలాంటి పనులు మనం ఎంతమంది చేస్తాం? అది అయ్యే పనేనా? ఆయనకేమన్నాపోనీ
ఒక 20 అంతస్తుల భవనం ఉందా? ఇంతమంది తుడవాలా? ఇంతమంది తుడవాలంటే 20 అంతస్తుల భవంతి
ఉండాలి. లేదు. మరి ఇలాంటి భౌతిక అర్థంతో చెప్పారా? స్థాన శుశ్రూష అంటే, మరి ఎలా
చెయ్యాలి? ఈ స్థాన శుశ్రూషలను దేనితో చెయ్యాలి? ఇందాకే చెప్పా మనసు వాక్కు
కర్మతోటే చెయ్యాలి. ఎట్లా చెయ్యాలి? మూడిటిని ఉపయోగించాలి తప్పదు. ఒక్కటే
ఉపయోగిస్తే ఎప్పటికీ పూర్తికాదు. ఇక మూడవదైనటువంటి భావ శుశ్రూష. భావ శుశ్రూష అంటే
శాస్త్రంలో ఏమి చెప్తున్నారు. గురువుగారు ఒక మంత్రోపదేశం చేశాడు కదా! ఆ మంత్రార్థం
ఎవరు? మంత్రార్థం అతని రూపు. అంటే గురువు ఆ మంత్రం బోధించిన తరువాత ఆ మంత్రం యొక్క
వాచ్యార్థ లక్ష్యార్థాలన్నీనీకు తెలియజేసిన తరువాత ఆ మంత్రాన్ని నువ్వు
ఉపాసించేటప్పుడు నీకొక ఆలంబన కావాలి. ఆలంబన లేకుండా బుద్ధి నిలబడదు. దానికి ఎవరు
దేనిని స్వీకరించాలంట ఇప్పుడు? గురువుగారి రూపాన్నే స్వీకరించాలి, ఎందకని
మంత్రార్థం అతనిరూపం. ఈ మంత్రార్థం అతని రూపు అనటంలో ఒక రహస్యం ఇమిడి ఉంది. గురువు
ఏ మంత్రమైన నీకు బోధించేటప్పుడు, ఆ మంత్రాన్ని సిద్ధించుకున్నవాడై ఉండాలి. అతను
సాధనలో ఉన్నటువంటి, అతను సాధనగా చేస్తున్నటు వంటి మంత్రాలను మీకు బోధించరు. ఏ
మంత్రమైతే సిద్ధింప చేసుకున్నారో, ఆ మంత్రాన్నే మీకు ఉపదేశ మంత్రంగా ఇస్తారు.
సిద్ధించినప్పుడు ఆమంత్రానికి ఆ గురువుగారికి అభేదమున్నది. కాబట్టి బుద్ధితో మీకు
ఆలంబన అవసరమైనప్పుడు ఏం చెయ్యాలట? ఆ భావాన్ని మంత్రార్థం అతని రూపు కాబట్టి
గురువుగారి రూపాన్ని భావరూపంలో పట్టుకోవాలి. అలా పట్టుకుని చేసేట్టైతే అది భావ
శుశ్రూష అవుతుంది అని శాస్త్రం చెప్పింది. ఇహ నాల్గవది ఆత్మ శుశ్రూష. ఆత్మ
స్థితిలో ఉన్నది ఏకం కదా! మరి శుశ్రూష ఎలా చేస్తావ్? చెయ్యాలంటే ఇద్దరుండాలా
వద్దా? చేయించుకునే వాడు, (చేసేవాడు). చెయ్యాలంటే ఇద్దరు ఉండాలా వద్దా?
చేయించుకునే వాడు, చేసేవాడు. మరి ఆత్మ శుశ్రూష అన్నప్పుడు ఆత్మ స్థితిలో గురువు
శిష్యుడు ఇద్దరున్నారా? లేరందామా? లేరంటే ఆత్మ శుశ్రూష అని శాస్త్రం ఎందుకు
చెప్పింది? అంటే శాస్త్ర వాక్యం అసత్యం కాదు. గురువాక్యం అసత్యం కాదు. ఆ రెండూ
కూడా సూచిస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శాస్త్రం కాని గురువు కాని
అనేక వాక్యాలు చెపుతూ ఉంటారు. ఆ వాక్యాలలో సాధన వాక్యాలుంటాయి. సూచన
వాక్యాలుంటాయి. అది భౌతికంగా చూస్తే మామూలుగా చూస్తేనేమో అది అసాధ్యం లాగా
కనపడుతుంది. కాని అసలు ఉత్తమమైన శుశ్రూష అంటూ ఏదైనా ఉందంటే? అది ఆత్మ శుశ్రూషయే
అయి ఉండాలి. అయితే నాలుగు శుశ్రూషలలో తప్పని సరిగా చేయవలసినది ఏదయ్యా అంటే? ఆత్మ
శుశ్రూషయే చేసి తీరాలంటా! అంటే అంగ స్థాన భావ శ్రుశ్రూషలు చేసినా చేయకపోయినా నీకు
గనుక అర్హత గనక ఉన్నట్లయితే చేయగల సమర్థత గనక ఉన్నట్లయితే నీవు ఆత్మ శ్రుశ్రూషని
ఆచరించాలి. యథార్థానికి గురువు ఏ స్థితిలో అయితే ఉన్నాడో ఆ స్థితిని యథాతథంగా
నీకందించ గలిగిన శ్రుశ్రూష అంటూ ఏదైనా ఉందంటే అది ఆత్మ శ్రుశ్రూషయే అయియున్నది.
కాబట్టి ఈ నాలుగు శ్రుశ్రూషలని శిష్యుడు ఏ స్థాయిలో ఉండి చేస్తున్నాడో గమనిస్తాడు
గురువు. గురుశిష్య సాంప్రదాయమంటే ఎంతో లోతైన వ్యవహారం. మామూలుగా మన సంసారమే చాల
పెద్ద లోతైనది. అతి అగాధమైనది. దాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం, మనసుని అర్థం
చేసుకోవటం చాలా కష్టం ఇలా ఏవో మాట్లాడుతూ ఉంటారు. కాని అనేక జన్మార్జితమైనటు వంటి
పుణ్యఫలాన్ని లెక్కకడితే తప్ప, అనేక జన్మార్జిత మైనటువంటి సంస్కార అనుబంధాన్ని
లెక్కకడితే తప్ప గురు శిష్య సంబంధాన్ని నిర్వచించటం చాలా కష్టం. ఏడు అడుగులు
నడిచేసి ఏడు జన్మలుగా నిన్ను ఆశ్రయించేశాను అన్నభావనతో వైవాహిక క్రతువు
నిర్వహించబడుతున్నది. ఏడు కాదు ఎన్నో జన్మలనుంచీ, లెక్క కట్టడానికి వీలు లేనన్ని
జన్మలనుంచీ నువ్వు నన్ను ఆశ్రయించి ఉన్నావని గీతాచార్యుడు అర్జునునితో అంటున్నాడు.
మరి ఇప్పుడు దానికేం చెప్తాం? కాబట్టి అనేక జన్మార్జితమైనటువంటి సంచిత రాశిని
పోగొట్టుకోవాలి అంటే, గురుకృప మించి వేరే మార్గం లేదు. మనకి జన్మ ఎక్కడ నుంచి
కలుగుతోంది ఇప్పుడు? కర్మ వల్లనే జన్మ కలుగుతున్నది. ఆ కర్మ ప్రభావం వల్లనే మన
మనస్సు వాక్కు పని చేస్తున్నాయి. సద్గురువును ఆశ్రయించాను త్రికరణ శుద్ధిగా!
అన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్లిప్పుడు వాళ్ళ యొక్క కర్మ ప్రేరణని, సద్గురు
వాక్యానికి అనుసంధానం చేసి ‘గురువాక్యం మేరకే నేను కర్మ ప్రేరణను స్వీకరిస్తాను’
అనే నియమాన్ని పెట్టుకోవాలి. ఏది తోస్తే అది చేయటం కాదు, నాకిది తోచిందండీ, బానే
ఉంది కదండీ, చేయటానికి అనువుగానే ఉంది కదండీ, నాకు లాభమే కదండీ, గురువాక్యాన్ని
అనుసరించి ఆ కర్మ ప్రేరణని విచారణ చెయ్యాలి. గురువు ఎక్కడ ఉంటాడు అసలు? భగవంతుడు
అంతటా ఎలా ఉన్నాడో, గురువు కూడా సర్వవ్యాపక ధర్మాన్ని కలిగి ఉన్నాడు. ఆ లక్షణాన్ని
కలిగి ఉన్నాడు. మరి సర్వవ్యాపకమైనదాన్ని అన్వేషించాలా? ఎక్కడ వెతుకుతావ్? గురువుని
అన్వేషించాలని అంటున్నారా లేదా అండి? నీకు తగిన గురువుని అన్వేషించాలి. ఎందుకని?
గురువు నిర్ణయం చెయ్యాలి అంటే, ఎవరు చెయ్యాలి? నేను గురువుని నేను పాఠశాల పెట్టాను
మీరందరూ చేరిపోండి అని ఎవరూ చెప్పరు. అలాగ చెప్తారా? చెప్పరు. ఈ గురువుగారు నాకు
పనికి వస్తారు అని నువ్వే నిర్ణయం చేసుకోవాలి. పనికోస్తాడో రాడో నువ్వే
తేల్చుకోవాలి. పనికొచ్చినంతకాలం ఆశ్రయిస్తావ్. నీకు పనికిరాకపోతే వదిలేస్తావ్.
నువ్వు పట్టుకోవటం వల్ల నువ్వు ఆశ్రయించటం వల్ల గురువుగారికి ఏ రకమైనటు వంటి
ప్రయోజనం సిద్ధించలేదు. నువ్వు వదిలెయ్యటం వల్ల కూడా గురువుగారికి ఏ రకమైనటు వంటి
లోటు రాలేదు. అర్థమైందా అండి?to be cont..
.png)
.png)